గంగాపూర్ గేట్ సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు..
ఆర్ఓబి నిర్మాణం కోసం భూ సర్వే నిర్వహణ.
రెబ్బెన,జూన్10(జనం సాక్షి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని గంగాపూర్ గేట్ నంబర్-71 కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్‌ఓబీ నిర్మాణ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఇటీవల జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు గేటు సమస్యను వివరించి, భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ నేపథ్యంలో బుధవారం రైల్వే శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి ప్రతిపాదిత ఆర్‌ఓబీ నిర్మాణానికి సంబంధించి భూ సర్వే నిర్వహించారు. సర్వే కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వాగతిస్తూ, సమస్య పరిష్కారానికి ఇది తొలి అడుగుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆర్‌ఓబీ సర్వే నిర్వహణకు స్పందించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రైల్వే బోర్డు సభ్యుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలంలకు రెబ్బెన మండల ప్రజలు, భారతీయ జనతా పార్టీ రెబ్బెన మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గంగాపూర్ గేట్-71 సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించి, ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



