గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా..

హైదరాబాద్‌: గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ (Governor Tamilisai) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నది. చెన్నై సెంట్రల్‌ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019, సెప్టెంబర్‌ వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే గతకొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణకు గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు. ఆతర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు.