కలెక్టర్ ఆశయం నీరుగార్చిన అధికారుల నిర్లక్ష్యం!

నిర్మాణ దశలోని కూలిన మురికి కాలువ గోడ
 నాసిరకం పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

కుబీర్, ఆగస్టు 09, (జనంసాక్షి): కుబీర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీ నుంచి పెద్దవాగు వరకు రూ.76 లక్షలతో చేపట్టిన మురికి కాలువ నిర్మాణం పూర్తికాకముందే కూలిపోవడం అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దశాబ్దాలుగా మురికి నీటి సమస్యతో నరకయాతన అనుభవిస్తున్న కాలనీ ప్రజల ఇబ్బందులను జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధులు మంజూరు చేయించారు. దీంతో తమ కష్టాలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే పనులు ప్రారంభం నుంచే నాసిరకంగా జరుగుతున్నాయని గ్రామస్తులు హెచ్చరించినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నాణ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గోడ కూలిపోవడంతో నిర్మాణం డొల్లతనం బహిర్గతమైందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల కోసం మంజూరైన భారీ నిధులను కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి వదిలేస్తే పర్యవేక్షణ వ్యవస్థ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ స్వయంగా పరిశీలించి మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనులకే ఈ దుస్థితి వస్తే.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఎంతమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం వృథా అవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని, నిర్మాణ నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.