39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల నిజమైన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోనప్పుడు, ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులను సహచర పోలీసులే అరెస్ట్ చేసినప్పుడు, పోలీసులు ఏమి చేయాలని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో వారి సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈమేరకు డిజీపీ జితేందర్‌ను హరీశ్‌ రావు కోరారు.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏక్‌ పోలీస్‌ విధానాన్ని అమలు చేయాలని బెటాలియన్‌ పోలీసుల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే శనివారం బెటాలియన్లలో ఆందోళనలు నిర్వహించిన కానిస్టేబుళ్లపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. క్షమశిక్షణా రాహిత్యంగా పరిగణిస్తూ 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని హరీశ్ రావు డీజీపీని కోరారు. మరోవైపు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.