విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే

సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది.శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ ప్రాజెక్ట్​ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ కానుంది.ఈ సెమీ హైస్పీడ్​ కారిడార్​ పూర్తయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి 4 గంటల్లోపే చేరుకునే అవకాశం కలుగుతుంది.

ఎలైన్‌మెంట్‌ ఖరారు

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల మధ్య సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌ పై కీలక నిర్ణయం జరిగింది. శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ నిర్మించనున్నారు. ప్రతిపాదనల మేరకు​ విశాఖ నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు చేరుతుంది. దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ సర్వే తుది దశలో ఉంది.

నాలుగు గంటల్లోనే

ఈ సర్వే నివేదికను రైల్వేబోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో సమర్పించే అవకాశం ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో తొలి సెమీ హైస్పీడ్ రైలు కారిడార్. ఈ మార్గంలో శంషాబాద్, రాజ మహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. గంటకు 220 కిలోమీటర్లు వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హై స్పీడ్‌ కారిడార్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ఈ సెమీ హైస్పీడ్​ కారిడార్​ పూర్తయితే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి 4 గంటల్లో చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైలు ప్రయాణానికి దాదాపుగా 12 గంటల వరకు సమయం తీసుకుంటోంది. వందేభారత్ 8.30 గంటల సమయం పడుతోంది.

కారిడార్ లో కొత్త స్టేషన్లు

విశాఖపట్నం-కర్నూలు వరకు అనుసంధానం మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించగా ఈ మార్గంలో మొత్తం 8 రైల్వే స్టేషన్లను అదనంగా వచ్చి చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైలు మార్గం సదుపాయం లేని అనేక పట్టణాలు, జిల్లాలు కొత్త కారిడార్‌తో రైల్వే నెట్‌వర్క్‌లో చేరే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి ప్రస్తుతం 2 మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కిలోమీటర్లుగా ఉంది. తాజా కారిడార్ పూర్తయితే ఇక నాలుగు గంటల్లోగానే శంషాబాద్ నుంచి విశాఖ చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.