చలో ఢల్లీికి కదిలిన రైలు

` బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం దేశ రాజధానికి తరలిన కాంగ్రెస్‌ నేతలు
` ప్రత్యేక రైలులో బయలుదేరిన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి తదితరులు
చర్లపల్లి(జనంసాక్షి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ ‘చలో దిల్లీ’ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో దిల్లీ బయలుదేరారు.చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి జెండా ఊపి రైలును ప్రారంభించారు. వీరితో పాటు కాంగ్రెస్‌ శ్రేణులంతా దిల్లీకి బయల్దేరి వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. బిల్లు ఆమోదించాలనే డిమాండ్‌తో ఈనెల 6న దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టనున్నారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున రైలులో వెళ్లారు.మరోవైపు బీసీ రిజర్వేషన్‌ పెంపుపై చర్చ కోరుతూ మంగళవారం పార్లమెంటులో కాంగ్రెస్‌ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. ఈ నెల 7న ఆ పార్టీ నేతలు రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్‌ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినా కేంద్రం మోకాలడ్డుతోందని విమర్శించారు. రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు.