దిలావర్‌పూర్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం


ఒకే రాత్రి 2 ఇళ్లలో చోరీలు – వరుస ఘటనలతో భయాందోళనలో ప్రజలు
దిలావర్‌పూర్, జూలై 15, (జనం సాక్షి): మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వరుస దొంగతనాలు కలకలం రేపాయి. స్థానికులైన గౌరీ పోశెట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువా బద్దలుకొట్టి రూ.40 వేల నగదు, ఒక తులం బంగారాన్ని అపహరించారు. అదే సమయంలో సమీపంలోని గారడి ముత్యం ఇంట్లోనూ దొంగతనానికి పాల్పడి రూ.30 వేల నగదును ఎత్తుకెల్లినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, ముఖాలకు మాస్కులు ధరించిన ముగ్గురు దుండగులు రాత్రి సమయంలో సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. దుండగులు మాస్కులు ధరించడం వల్ల వారు స్థానికులా లేక బయటి వ్యక్తులా అనే కోణంలో విచారిస్తున్నామన్నారు.
కూలీ డబ్బు పోయిందని రోదనలు: “రోజంతా కూలీ చేసి పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు” అంటూ బాధితులు కన్నీరుమున్నీరు అయ్యారు.
మండల కేంద్రంలో వరుస చోరీలు ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పోలీసు గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.



