పర్యాటక కేంద్రంగా ఉడందాపూర్ జలాశయం

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, ఆగస్టు 8 (జనంసాక్షి): ఉడందాపూర్ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 26న తెలంగాణ శాసనసభలో జీరో అవర్ సందర్భంగా తాను చేసిన ప్రస్తావనకు ప్రభుత్వ యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారికంగా స్పందించిందని ఆయన వెల్లడించారు. సోమశిల, అలంపూర్ స్పెషల్ టూరిజం ఏరియాలో భాగంగా ఉడందాపూర్ రిజర్వాయర్‌ను ప్రభుత్వం చేర్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి అవసరమైన సమగ్ర మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పన ప్రస్తుతం కొనసాగుతోందని, ఈ ప్రతిపాదనకు సంబంధిత మంత్రుల ఆమోదం లభించిందని వివరించారు. నూతన టూరిజం పాలసీకి అనుగుణంగా ఇక్కడ జల, ప్రకృతి, సాహస పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం వల్ల జడ్చర్ల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.



