మా బాధలను అర్ధం చేసుకోండి

గత కొన్నిరోజులుగా జిల్లాల్లో కొనసాగుతున్న బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌కు వ్యాపించాయి. బెటాలియన్‌ పోలీస్‌ కుంటుంబాల సభ్యులు సచివాలయ ముట్టడికి యత్నించారు. సెక్రటేరియట్‌ ముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఒకే దగ్గర విధులు నిర్వర్తించేలా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఏక్‌ పోలీస్‌ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ కుటుంబ సభ్యుల బాధలను అర్ధం చేసుకోవాలన్నారు. కాగా, వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

‘ఏక్‌ పోలీస్‌’ హామీ ఏమైంది..
అందరి పోలీసుల్లాగే తమ భర్తలు కూడా పరీక్షలు రాసి, ఫిజికల్‌ టెస్టుల్లో పాసై, 9 నెలలు కఠోర శిక్షణ తీసుకున్నవారేగా? వాళ్లకెందుకు మిగతా సివిల్‌, ఏఆర్‌ పోలీసుల్లాగా ఒకే చోట డ్యూటీలు వేయరు? వాళ్లను కట్టుకున్న పాపానికి మేమేం తప్పు చేశాం? అంటూ బాధిత బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ‘మా భర్తలు ఏడాదికి మూడు జిల్లాలు తిరగాల్సి వస్తుంది. మేము ఎక్కడ ఉండాలి? మా బిడ్డలు ఎక్కడ చదువుకోవాలి? చేసేది పోలీసు ఉద్యోగమైనా ఈ తిరుగుడేంది?’ అని ప్రశ్నిస్తున్నారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న తమ భర్తలను తోటి పోలీసులే జీతగాండ్లలాగా చూస్తున్నారని.. పొద్దున్నే పలుగు, పారలతో గడ్డి పీకిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలో సివిల్‌, ఏఆర్‌ పోలీసుల మాదిరిగానే బెటాలియన్‌ పోలీసులకు వారు కోరుకున్న జిల్లాలో కనీసం 3-5 ఏండ్లు ఒకే చోట పనిచేసే వెసులుబాటు కల్పించాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీని వల్ల పిల్లల చదువులకు అంతరాయం లేకుండా ఉంటుందని, ఉద్యోగభారం తగ్గుతుందని చెబుతున్నారు.

గతంలో ఎలా ఉందంటే..?
గతంలో టీజీఎస్పీ బెటాలియన్లలో పనిచేసే సిబ్బందికి 15 రోజులు డ్యూటీ ఉంటే ఎక్కడో మారుమూల స్టేషన్‌ నుంచి ఇంటి ప్రయాణానికి ఒకరోజు కేటాయించినా 3 రోజులు కుటుంబంతో గడిపే అవకాశం ఉండేది. ప్రస్తుతం 26 రోజులు డ్యూటీ చేసిన తర్వాత నాలుగు రోజులు సెలవు తీసుకోవాలని నిబంధనను కొత్తగా వచ్చిన ఏడీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ తీసుకురావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటామని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 13 బెటాలియన్స్‌ ఉన్నాయి. ఒక్కో బెటాలియన్‌లో 1500 మంది చొ ప్పున సిబ్బంది ఉంటారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌లో కచ్చితంగా 200 మంది పహారా ఉంటారు. మిగిలిన వారిని ఏ బీ సీ డీ ఈ ఎఫ్‌ జీ కంపెనీలుగా విభజిస్తారు. ఆయా బెటాలియన్‌ పరిధిలోని ఒక పోలీస్‌ స్టేషన్‌లో కనీసం 3 నెలలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. బెటాలియన్‌ పరిధిలోని అన్ని పీఎస్‌లకు రోటేట్‌ అవుతుండాలి. దీనిని మార్చేందుకు కేసీఆర్‌.. ‘ఏక్‌ పోలీస్‌’ను ప్రవేశపెడదామనుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 26రోజుల డ్యూటీ విధానాన్ని తీసుకొచ్చింది.