మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి

మంగపేట నవంబర్ 07(జనంసాక్షి)
జిరాక్స్ ల కోసం వచ్చేవారికి జేబులకు చిల్లులే….
ఇదేంటని ప్రశ్నిస్తే తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు అంటూ దురుసు సమాధానం…
మీసేవ కేంద్రాల దోపిడిని అదుపు చేయడంలో అధికారులు విఫలం…?
ప్రజల అవసరాలే వారికి అవకాశంగా మారడంతో రోజురోజుకు మీసేవ కేంద్రాల నిర్వాహకుల ఆగడాలు తారాస్థాయికి చేరుతున్నాయంటూ ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రల నిర్వాహకులు కొంతమంది తమ వైఖరి మార్చుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల ప్రజలు తమ ఆవేదనలను వ్యక్తపరుస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల కోసం వెళ్తే తమకు ఇష్టం వచ్చిన రేట్లను చెప్పడం జరుగుతుందని ఇంత రేటు ఏంటని ప్రశ్నిస్తే జిరాక్స్ తీసుకుంటే తీసుకో లేదంటే వెళ్ళిపో అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారు అంటూ ప్రజలు నిర్వాహకుల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వెల్లడించినట్లు తెలిపారు. మీసేవ కేంద్రాలపై ఫిర్యాదులు అందినప్పుడే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు పరిశీలించి ఎటువంటి చర్యలు తీసుకోకుండానే చేతులు దులుపుకుంటూ వెళ్లిపోతున్నారని ప్రజలు తీవ్రంగా అసహనం వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మీసేవ కేంద్రాల నిర్వహకులపై పలుమార్లు దినపత్రికల ద్వారా తెలిపిన కూడా సంబంధిత జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు తూతూ మంత్రంగా తనిఖీ లు నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోవడం ఏంటి అని బహిర్గతంగానే ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు పలుమార్లు మీసేవ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన సమయాల్లో ధరల పట్టికను బహిర్గతంగా అందరి కనిపించేలాగా ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేటి వరకు కూడా కొన్ని మీసేవ కేంద్రాల్లో కనిపించడం లేదని ఈ విషయంపై అధికారులు చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రజలు ఆరోపించారు.
మీసేవ కేంద్రాల నిర్వాహకుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం : గుగ్గిళ్ళు సురేష్ మాదిగ
ప్రజల అవసరాలు, అమాయకత్వాలను ఆసరాగా చేసుకుని జిరాక్సుల పేరుతో మీసేవ నిర్వాహకులు చేస్తున్న నిలువు దోపిడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు గుగ్గిళ్ళ సురేష్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనంగా వసూళ్లు చేస్తున్నారని మరల జిరాక్సుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని తనిఖీల పేరుతో అధికారులు చర్యలు చేపట్టకుండా చేతులు దులుపుకుంటూ వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.



