ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు పాతర

  • ప్రైవేటు పాఠశాలలే వ్యాపార కేంద్రాలు
  • జడ్చర్లలో యథేచ్ఛగా పాఠ్యపుస్తకాలు విక్రయం
  • మౌనంగా విద్యాశాఖ అధికారులు
  • ఆందోళనలో తల్లిదండ్రులు

 

జడ్చర్ల, జూన్ 13 (జనంసాక్షి): చదువుల అభయహస్తం అందించాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గర పడడంతో నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు పాఠశాలలు పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు విక్రయిస్తూ పాఠశాల యాజమాన్యాలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.

అడ్డగోలుగా దోపిడీ:ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కావాలి. కానీ, జడ్చర్ల పట్టణం మరియు మండలంలోని సుమారు 100కు పైగా పాఠశాలలు ఈ నిబంధనలను కనీసం పట్టించుకోవడం లేదు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అవసరమైన స్టడీ మెటీరియల్ కోసం ఒక్కో విద్యార్థిపై రూ. 3,000 నుంచి రూ. 10,000 వరకు భారం వేస్తూ యాజమాన్యాలు లక్షలాది రూపాయల లాభాలను ఆర్జిస్తున్నాయి. బయట మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే వస్తువులను కూడా, పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.

కన్నెత్తి చూడని అధికారులు:జడ్చర్ల పరిధిలో సుమారు వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు, పుస్తకాల ధరలతో సామాన్య తల్లిదండ్రుల నడ్డి విరుగుతుంటే, అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం తనిఖీలు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రుల డిమాండ్: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాలల్లో విక్రయాలు సాగిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.

తాజావార్తలు