విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ లను

 

 

 

 

 

 

 

ఒకే కుల జనాభాగా ప్రభుత్వం ప్రకటించాలని

ఈనెల 31న విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

విశ్వకర్మ జేఏసీ చైర్మన్ రాయబండిపాండురంగ చారి

హయత్ నగర్, మే 25 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిపిన తరువాత ఏప్రిల్ 16న రాష్ట్రంలోని అన్ని కులాల జనాభా ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని కులాలు ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా మా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ కులం ఒకే కులం గా ప్రకటించాలి అని విశ్వకర్మ జేఏసీ చైర్మన్ రాయబండి పాండురంగ చారి పత్రిక సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా పాండురంగా చారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఒ కే కులంగా కాకుండా, విడగొట్టి విడివిడిగా కమ్మరం, వడ్రంగం, కంచరం, శిల్పి, స్వర్ణకార వృత్తులను కులాలుగా ప్రకటించింది. అంటే మా కుల జనాభా రాష్ట్రంలో ఎంత ఉన్నది అనేది స్పష్టత లేకుండా పోయింది. రాష్ట్రంలో అన్ని కులాల జనాభా ప్రకటిస్తే మా కులం మాత్రం విడగొట్టి వృత్తులను కులాలుగా ప్రకటించడం ఎంతవరకు న్యాయం? ఒకే కులంగా ప్రకటించాలని సంబంధిత బీసీ కమిషన్ చైర్మన్ కు, మంత్రులకు, సలహాదారులకు విశ్వకర్మ జేఏసీ ఆధ్వర్యంలో వారి దృష్టికి తీసుకపోయినా ఫలితం దక్కలేదు. ప్రభుత్వానికి ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి ఎన్ని వినతులు చేసిన ప్రభుత్వం స్పందించిడం లేదు, ఇకనైనా విశ్వకర్మ ప్రజానీకం ఐక్యమత్యంగా నిరసనలు, ఉద్యమాలతోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అవసరం ఉంది.
అన్ని కులాలకు పాలకమండలి కార్పొరేషన్ లు చైర్మన్, వైస్ చైర్మన్ గా ప్రకటించారు, కానీ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ కులానికి మాత్రం ప్రకటించకపోవడం ఇంతకన్నా అవమానం మరొకటి లేదు. అందుకు మన పంచదాయాలుగా ఉన్న మనం విశ్వబ్రాహ్మణుల, విశ్వకర్మల ఆత్మగౌరవం కోసం ఏకం కావాల్సిందే, లేని పక్షంలో మన ఆత్మాభిమానానికి అవమానం జరిగినట్లే!

మేమెంతో మాకంతా వాటా కోసం

విశ్వకర్మలంతా ఏకం కావాల్సిందే

పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణ పోరాట ఆద్యుడు, బహుజన వీరుడు, విశ్వకర్మ ముద్దుబిడ్డ మారోజు వీరన్న, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో తొలి మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ జాతిపిత సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, నూనుగు మీసాల నూతన యవ్వనంలో తన ప్రాణాలను తృణప్రాయంగా ఊపిరి వదిలిన అమరుడు కాసోజ్ శ్రీకాంతాచారి లాంటి విశ్వకర్మ వీరుల బలిదానం, రాష్ట్ర వ్యాప్తంగా మరొక 39మంది విశ్వకర్మలు ఆత్మ త్యాగాలు చేసిన జాతివల్ల తెలంగాణ వచ్చింది అనేది తెలంగాణ సాక్షిగా నిజం కాదా?మా బలిదానాలతో ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారు కానీ, త్యాగాలు చేసిన మాకు బలిదానాలు, ఏ త్యాగం చేయని మీకు రాజ్యాధికారమా? ఇది చెల్లదు గాకా చెల్లదు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ అమరుల సాక్షిగా అన్ని రంగాల్లో మేమెంతో మాకంతా వాటా కోసం విశ్వకర్మలంతా ఏకం కావాల్సిందే అని అన్నారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఒకే కుల జనాభా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈనెల 31న హైదరాబాదులో అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్థూపం వద్ద ఆదివారం ఉదయం 9:30 ని. లకు నిరసన కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సోదరీసోదరులారా భుజం, భుజం కలిపి – అడుగులో అడుగు వేసి, ఉప్పెనలై ఉద్యమానికి నాంది పలకాలని విశ్వకర్మ జేఏసీ పిలుస్తుంది రా కదలిరా !!