కాలుష్య రహిత పరిశ్రమల్నే ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి) : తెలంగాణలో కాలుష్య రహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తామని, కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని వెల్లడించారు.. అక్కడ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లగచర్ల ఘటనపైన తనని కలిసి వినతిపత్రం అందజేసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని స్పష్టంచేశారు. కొడంగల్‌ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత అని, సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానని అన్నారు. రాష్ట్రంలో కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పెంపును కూడా పరిశీలిస్తామని తెలిపారు.