10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజం : కేటీఆర్
హైదరాబాద్ (జనంసాక్షి) : రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ రూ.10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘బుధవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఉన్నాయి. అధికార మదంతో విర్రవీగుతూ.. మేమే నియంతలం, రారాజులం అని అనుకుంటున్న వారికి నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు ఒక గుణ పాఠం. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేరే ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవాడు. కానీ రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు కాబట్టి దులుపుకొని పోతున్నడు. హెచ్‌సీయూ భూముల కోసం పోరాడిన విద్యార్థులు, సామాజికవేత్తలకు అభినందనలు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. కంచగచ్చిబౌలి భూమి వర్సిటీ ఆధీనంలో ఉన్నదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చెప్పింది. ఆ భూములపై సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సూచించింది.