పాలన చేతకాక పనికిమాలిన మాటలు
పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. పాలన చేతకాక పనికిమాలిన మాటలు, పాగల్ పనులు చేస్తున్నారని, తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు.మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (పర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అయిందని చెప్పారు. మూసీ ప్రాజెక్టులో రూ.లక్షా 50 వేల కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించిందని తెలిపారు. బిల్డర్లను, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందన్నారు. మీ బడే భాయ్ మోదీ ఐటీఐఆర్‌ను రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చేయకపోయినా, ఐటీ ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ని పదకొండేండ్ల ముందే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిదని స్పష్టం చేశారు. ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్తన భాండాగారమైందని, దేశంలోనే ధాన్యరాశిగా మారిందని చెప్పారు. పేదల కంట కన్నీరు లేకుండానే లను అధిగమించి ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ సిటీ అవార్డును హైదరాబాద్ దక్కించుకుందని తెలిపారు.మూసీ నదికి అటూ ఇటూ అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు కడుతున్నప్పుడు మరి ఫోర్త్ సిటీ ఎందుకని ప్రశ్నించారు. మూసీ పక్కన పెట్టుబడి పెట్టేందుకు ఫోర్ బ్రదర్స్ మనీ స్పిన్నింగ్ కోసమా అని నిలదీశారు. ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు కొడుతున్నారని మండిపడ్డారు. ఎత్తయిన కుర్చీలో కూర్చుంటేనో, సమావేశాల్లో తల కిందకి, మీదకి తిప్పితేనో అభివృద్ధి జరగదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటూ గవర్నమెంట్ బడి పిల్లల ఇజ్జత్ తీయొద్దని సూచించారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్ మాట్లాడతారని, ప్రపంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.