యాదాద్రి థర్మల్ కేంద్రం జాతికి అంకితం
` 800 మెగావాట్ల యూనిట్ `1 గ్రిడ్‌కు అనుసంధానం
` ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డి
` యాదాద్రి టౌన్షిప్ పనులకు శంకుస్థాపన
మిర్యాలగూడ, ఆగస్టు 1 (జనంసాక్షి):అన్ని యూనిట్ల విద్యుత్ పనులను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే జనవరి 2026 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఉద్యోగులకు కల్పిస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం యూనిట్- 1 ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాధనం వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయానికి పవర్ ప్లాంట్ పూర్తయ్యేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్లాంట్ నిర్మాణం పనులు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వంపై అధిక భారం పడుతున్నప్పటికీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవడంతోపాటు పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రెండో యూనిట్ ఉత్పత్తి ప్రారంభం కాగా ప్రస్తుతం మొదటి యూనిట్ ప్రారంభించుకోవడం ఆనందంగా వ్యక్తం చేశారు. మిగిలిన యూనిట్లను కూడా పూర్తి చేసి జనవరి 26 నాటికి పూర్తి స్థాయి విద్యుత్తును అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు సిబ్బంది కోసం సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. వైటిపీఎస్ లోని ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు అత్యంత ఉన్నత ప్రమాణాలతో విద్య, వైద్యం అందించేందుకు పాఠశాల, వైద్యశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ తో పాటు పులిచింతల లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూర్ జై వీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఎస్పీ చరణ్ పవర్, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.