వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై
ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న వేళ.. ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై చెప్పారు. తొలుత గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా.. గుర్తింపు దక్కలేదని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయన్నారు. కొందరు వ్యక్తుల సొంత నిర్ణయాలతోనే వైసీపీ పార్టీ నడుస్తుందని చెప్పుకొచ్చారు. పార్టీకి మోసం చేసిన కొందరు వ్యక్తులకు పిలిచి మరీ పట్టం కట్టారని రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులను చేరదీసిన వాళ్లు.. ఇవాళ పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో కలియతిరిగి.. పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా.. పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఆయన బాధను వ్యక్తపరిచారు. సమాజంలో విలువ లేని వ్యక్తిని, పార్టీ ఓటమి కోసం పని చేసిన వ్యక్తిని చేరదీశారన్నారు రోషయ్య. అన్ని విధాలా తాను పార్టీలో అవమానాలను ఎదుర్కొన్నానన్నారు.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఎంతో అనుభవం ఉందని.. అన్ని అర్హతలు ఉన్న ఆయనకు కాకుండా.. మరో వ్యక్తికి… మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి ఇచ్చారన్నారు రోశయ్య. ఈ వరస పరిణామాలతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గుంటూరు జిల్లాలో వైసీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి..ఇటీవలే గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా కిలారి రోశయ్య పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశమైంది.. అయితే రోశయ్య జనసేన పార్టీలోకి వెళతారని అనుచరుల ద్వారా తెలిసింది.