అందుబాటులో అంగన్‌వాడీ కేంద్రాలు
సంగారెడ్డి,నవంబర్28(జనం సాక్షి): కోహీర్ మండలంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటితో ఇబ్బందులు తీరనున్నాయి. త్వరలోనే వీటిని ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహరం అందించేందుకు అనుకూలంగా ఉంటుంది. గతంలో సొంత భవనాలు 22 ఉండగా నూతనంగా 15కేంద్రాల్లో భవనాలను నిర్మించారు. కేంద్రాల్లో పాలు, గుడ్లు, బాలామృతం అందించడంతో పాటు ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేసేందుకు సులువుగా ఉంటుంది. చిన్నారులు ఆటలు ఆడేందుకు, వారి బరువును తూచేందుకు స్థలం అనువుగా ఉంటుంది. నూతన భవనాల నిర్మాణంపై ఆయా గ్రామాల అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారందరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తున్నది. నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. కోహీర్ మండలంలో 20గ్రామ పంచాయతీలకు గానూ 60 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. సొంత భవనాలు 22మాత్రమే ఉన్నాయి. 33భవనాలకు అద్దె చెల్లిస్తున్నారు. 8భవనాలు ఉచితంగా కొనసాగుతున్నాయి. సరిపడా భవనాలు లేకపోవడంతో ఇరుకుగా ఉండడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వారు పడుతున్న అవస్థలను గుర్తించిన ప్ర భుత్వం నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మల్టీ సెక్టార్ అభివృద్ధి పథకం ద్వారా కేంద్ర ప్రభు త్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించారు. మరో రెండు భవనాలను పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు.