తెరాస హయాంలో ఆలయాలకు మహర్దశ

– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
అదిలాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : టీఆర్‌ఎస్‌ హయాంలోనే మన రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలో గల శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయాన్ని మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయ దర్శనానికి వచ్చారు.  ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులకు ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని ఆలయాలకు ధూప, దీప నైవేద్యాలకు
కూడా నోచుకోలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతీ ఆలయానికి నిధులను వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కడ్తాల్‌ శ్రీ అయ్యప్పస్వామి ఆలయ అభివృద్ధికి అతి త్వరలోనే కావాల్సిన నిధులు మంజూరీ చేయిస్తానని హావిూ ఇచ్చారు. ఇక్కడికి వచ్చే అయ్యప్ప స్వాములు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం గురుస్వామి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులను ఆశీర్వాదించి తీర్థప్రసాదాలు అందజేశారు.