నీటి వృధాపై ప్రజల్లో చైతన్యం

ప్రజల్లో చైతన్యానికి కసరత్తు
ఆదిలాబాద్‌,అక్టోబర్‌4 (జనంసాక్షి):   గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం నీటి వృథాపై దృష్టి సారించాల్సిన అవసరముంది. బోరుబావుల్లో చేతిపంపులకు బదులు సింగిల్‌ ఫేజ్‌ మోటారు బిగిస్తూ విచ్చలవిడిగా నీటి వృథాకు వూతమిస్తున్నారు. చాలా వరకు చేతిపంపులు తొలగించి సింగల్‌ ఫేజ్‌ మోటార్లు బిగించారు. అధికారిక లెక్కల్లో మాత్రం వాటిని చూపడం లేదు. ప్రజలు శ్రమ పడకుండానే సులువైన పద్ధతులకు అలవాటు పడుతుండటం నీటి వృథాకు కారణమవుతోంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అధికారులు నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ఇప్పటికైనా సింగల్‌ ఫేజ్‌ మోటార్లకు బదులు చేతిపంపు బిగిస్తే నీటి వృథా అరికట్టడంతో పాటు అన్ని వేళల్లో నీటి సౌకర్యాన్ని కల్పించినవారవుతారు. కొన్నిచోట్ల నీటి ప్రాముఖ్యంపై నిత్యం వివిధ సాధనాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గత వేసవిలో వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటి తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటోంది. జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు వట్టిపోయాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ భూగర్భజలాలు పెరగలేదు. నీరంతా వృథాగా పోయింది. పలుచోట్ల రక్షిత మంచినీటి పథకాలకు నీటిని సరఫరా చేసే బోరుబావులు అడుగంటి పోయాయి. ఇదంతా ఒకెత్తయితే ఉన్న నీటిని పొదుపు చేసి ప్రజలందరికీ ఉపయోగపడేలా చర్యలు చేపట్టకపోవడం మరో ఎత్తు. నీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న ప్రజలు కొద్దిపాటి అవగాహనతో నీటిని పొదుపు చేయొచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో చాలా గ్రామాల్లో నీరు వృథా అవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వ యంత్రాంగానికి ఇప్పటికైనా కనువిప్పు కలగకపోతే నీటి ఎద్దడి తీవ్రతరం కానుంది.  అన్ని గ్రామాల్లో అధికారులు, సిబ్బంది నీటి పథకాలు, వాటి పని తీరు నివేదికలను రూపొందించారు. చేతిపంపులకు బదులు పంపుసెట్లను బిగించిన గ్రామాల్లో నీటి లభ్యత, నిల్వ సామర్థ్యం మేరకు తగినన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.  చేతిపంపులు బిగించడమో లేదా గ్రామస్థులకు అవగాహన కల్పించి నీటిని పొదుపు చేసేలా కృషి చేస్తామని చెప్పారు.