భూపతి కృష్ణమూర్తి కన్నుమూత

736dqdnsహ‌న్మ‌కొండ జ‌నంసాక్షి: స్వాతంత్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి కన్నుమూశారు. భారత స్వాతంత్ర సంగ్రామం, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం అర్ధరాత్రి వరంగల్ లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. 1926 ఫిబ్రవరి 21 జన్మించిన ఆయన బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. మహాత్మా గాంధీతో కలిసి దండియాత్రలోనూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విశేష కృషి చేశారు. మరి కొద్ది రోజుల్లో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగానే.. ఆకస్మికంగా మృతి చెందారు. తెలంగాణవాదులకు తీరని దుఖాన్ని మిగిల్చారు.

భూపతి కృష్ణమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలంగాణసమాజానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు కన్నుమూయనని చెప్పి మాట మీద నిలబడిన మహోన్నత వ్యక్తిగా ఆయన్ను కేసీఆర్ కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తాను ఢిల్లీ పర్యటనలో ఉన్నందున అంత్యక్రియలకు హాజరుకాలేపోతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి అంత్యక్రియల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ సెక్రటరీలు వినయ భాస్కర్, సతీష్ కుమార్ తో పాటు పలువరు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

తెలంగాణ తల్లి విముక్తి కోసం భూపతి కృష్ణమూర్తి ఎన్నో పోరాటాలు చేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడారు. 1953-54 సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ వరంగల్ వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడారు. తెలంగాణను ఎట్టిపరిస్థితుల్లో వేరే ప్రాంతంతో కలపొద్దని గళమెత్తి గర్జించారు. ఇడ్లీ సాంబార్ వ్యతిరేక ఉద్యమం వరంగల్ లో పురుడుపోసుకున్నప్పుడు క్రీయాశీలకంగా పని చేశారు. నాటి ప్రభుత్వాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ముక్తకంఠంతో విభేదించారు. తెలంగాణలో ఆంధ్రాపార్టీల పెత్తనం వద్దని ఆనాడే తెగేసి చెప్పారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే కన్నుమూశారు.

మాతృభూమి విముక్తి కోసం అహర్నిషలు కృషి చేసి నేలకొరిగిన మహానీయుడికి తెలంగాణ సమాజం జోహార్లు అర్పిస్తోంది. అశృ నయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తోంది.