మహాకూటమి అంటే వణుకు ఎందుకో?

share on facebook

నిలదీసిన శశిధర్‌ రెడ్డి
మెదక్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): తెలంగాణలో మహాకూటమి విజయం ఖాయమని, ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారని కాంగంరెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్‌ రెడ్డి అన్నారు. అందుకే తమ పొత్తులపై ప్రశ్నిస్తున్నారని గురువారం నాడిక్కడ అన్నారు.  రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసింది ఉద్యమకారులని, శ్రీకాంతచారి లాంటి ఎందరో ఆత్మత్యాగాలను చూసి చలించి సోనియాగాంధీ తెలంగాణ ప్రకటించిందన్నారు. చంద్రబాబు, జగన్‌ రాసిన లేఖలతోనే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని తెరాస నేతలు గుర్తించాలన్నారు. నాలుగేళ్ల నుంచి అధికారంలో ఉన్న ఎంపీలు, సీఎం కేసీఆర్‌ 7 మండలాల విషయాన్ని పార్లమెంటులో గుర్తు చేయలేదని, ఎన్నికల్లో తెదేపాతో పొత్తు అనగానే ఈ విషయాలను మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెదేపాతో పాటు ఇతర పార్టీలతో పొత్తులంటేనే తెరాస నేతలకు వణుకు పుట్టిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామిలు నెరవేర్చకుండా మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖలు రాయడం చూస్తే ఓటమి భయం పట్టుకుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రోహులతో పొత్తులంటున్న మంత్రి హరీశ్‌రావు 2004, 2009 సంవత్సరంలో చంద్రబాబుతో తెరాస పొత్తులు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. ఆంధ్రా గుత్తేదారులతో ప్రాజెక్టుల పనులు చేయించుకుంటున్నారని, రాజకీయాలకు వస్తే చంద్రబాబుపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో చూసి తెరాసకు భయం పట్టుకుందని అన్నారు.  అబద్దాలతో గద్దెనెక్కిన కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడించటం ఖాయమని అన్నారు.

Other News

Comments are closed.