మోగిన ‘పరిషత్‌’ నగారా!

share on facebook

– ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ

– మే6,10, 14 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు

– 27న ఓట్ల లెక్కింపు.. అదేరోజు ఫలితాలు

– మొత్తం 538 జడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు

– జడ్పీటీసీలకు రూ. 4లక్షలు, ఎంపీటీసీలకు రూ.1.50 లక్షలు వ్యయపరిమితి

– తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ

– రాష్ఠ వ్యాప్తంగా 32వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

– వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : స్థానిక సమరానికి నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యాప్తంగా 539 జడ్పీటీసీలు ఉండగా మంగపేట జట్పిటీసికి మినహా మిగిలిన 538 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5857 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 47ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహించట్లేదని పేర్కొన్నారు. కాగా మిగిలిన 5817 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1కోటి 56లక్షల11వేల320 మంది ఓటర్లు ఉన్నారని, ఈరోజు వరకు ఓటు కోసం నమోదు చేసుకున్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఎంపీటీసీలకు రూ.1.50లక్షలు, జడ్పీటీసీలకు రూ.4లక్షలు వ్యయపరిమితిని పెట్టినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీచేసే వారు ఆన్‌ లైన్‌ ద్వారా అప్లికేషన్‌ పెట్టుకోవాలని సూచించారు. మొత్తం 1.47లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది అవసరమవుతారని, 32వేల పోలింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం మూడు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. మొదటి విడత 6, రెండవ విడత 10, మూడవ విడత 14 తేదీల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నామని, మూడు విడతల్లోని ఫలితాలను మే27న విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్‌ పేర్కొన్నారు.

మొదటి విడత..

రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు నాగిరెడ్డి పేర్కొన్నారు. మొదటి విడతలో భాగంగా 197 జడ్పీటీసీలు, 2166 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మే6న మొదటి దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఫస్ట్‌ ఫేజ్‌ ఎన్నికలకు ఈనెల 22 నుంచి 24వరకు నామినేషన్‌ల స్వీకరణ, 25న నామినేషన్‌ల పరిశీలన, 27వరకు ఫిర్యాదుల స్వీకరణ, 28 వరకు నామినేషన్‌ల ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు.

రెండవ విడత..

రెండవ విడతలో మే10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 180 జడ్పీటీసీ స్థానాలకు, 1913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 26 నుంచి 28 వరకు నామినేషన్‌లను స్వీకరించనున్నారు. 29న నామినేషన్‌ల పరిశీలన, మే1న ఫిర్యాదుల స్వీకరణ, మే2వరకు నామినేషన్‌ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

మూడవ విడతలో..

మూడవ విడతలో మే14న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 161 జడ్పీటీసీలు, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 30 నుంచి మే2వరకు నామినేషన్‌ లస్వీకరణ, మే3న నామినేషన్‌ల పరిశీలన, మే5న ఫిర్యాదుల స్వీకరణ, మే6 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. కాగా మూడు విడతల్లో జరిగిన ఎన్నికలను మే 27న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అదేరోజు ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. కౌంటింగ్‌ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

 

Other News

Comments are closed.