రైతు వేదికల ప్రారంభోత్సవానికి సిద్దమైన కొడకండ్ల

share on facebook

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు
ఇక్కడికి సిఎం రావడం అదృష్టమన్న మంత్రి ఎర్రబెల్లి
జనగామ,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి)  వరంగల్‌ జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో రైతువేదికలను సిఎం కెసిఆర్‌ శనివారం ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. సిఎం రాకతో భారీగా
బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే భావనతో కర్షకులకు టీఆర్‌ఎస్‌ సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతు వేదికలకు కొడకండ్లలో శ్రీకారం చుట్టేందుకు ముఖ్యమంత్రి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వ్యవసాయంలో ఒడిదుడుకులు, కష్టనష్టాలు తెలిసిన మహానుభావుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో చరిత్రలో ఏనాడు లేని విధంగా వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణకు అడుగ పడిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళన సహా ధరణి పోర్టల్‌, రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. పల్లె ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అన్నారు. తొలుత రైతు వేదికను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి సవిూపంలోని పల్లె ప్రకృ తి వనాన్ని సందర్శిస్తారని చెప్పారు. గుట్టల మధ్య నీటి కొలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లబ్దిదారుల కోసం సిద్ధం చేసిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభించి మార్కెట్‌ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసే సభలో 5వేల మంది రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్రంలో రూ.573 కోట్లతో 2604 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని, ప్రతి 5వేల మంది రైతులకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతు వేదికలు, వాటి ఆఆవశ్యకత ఏంటన్నది కొడకండ్ల సభలో సిఎం కెసిఆర్‌ రైతులకు వివరిస్తారు. వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రమంతటా రైతు వేదికలు నిర్మిస్తుండగా రాష్ట్రంలోనే మొదటిసారిగా జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ ఈనెల 31న రానున్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రైతు వేదికను ప్రారంభించి ఇక్కడి పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతుసభా వేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ఐదు వేల మంది రైతులతో సీఎం కేసీఆర్‌ ముఖాముఖి మాట్లాడుతారు. రైతు వేదికల ఉద్దేశం, వాటి ఆవశ్యకత, వాటి ద్వారా రైతులకు కలిగే ఉపయోగాలను వివరిస్తారు. ఈ కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లాలోని రైతుబంధు సమితి
గ్రామ, మండల, జిల్లా ప్రతినిధులు హాజరుకానున్నారు. వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. మండల కేం ద్రంలో హెలీప్యాడ్‌ను సిద్ధం చేయగా, పోలీసులు భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Other News

Comments are closed.