విమోచన దినోత్సవంపై స్పష్టత ఇవ్వాలి: బిజెపి
ఆదిలాబాద్,ఆగస్ట్17(జనంసాక్షి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తారా లేదా అన్నది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచనం నిర్వహించడంలో ఎందుకు భయపడుతన్నారో చెప్పాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింప చేసేందుకు సెప్టెంబర్ 17న ప్రభుత్వమే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు రాష్ట్ర పార్టీ ఆలోచన చేస్తోందని, ఈ సభలకు భాజపా జాతీయ అధ్యక్షులు ఆమిత్‌షా రానున్నట్లు పేర్కొన్నారు. గతంలో తాము అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హావిూలకు కట్టుబడి ఉండాలన్నారు. ముస్లింలను మభ్య పెట్టేందుకు తెలంగాణ సెంటిమెంట్‌ను తాకట్టు పెట్టడం సరికాదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఎంఐఎంకు భయపడే.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో తెరాస వైఖరి మారకుంటే బిజెపి అధ్వర్యంలో త్వరలో ఆందోళన చేపడతామని అన్నారు. సెప్టెంబర్ 17న తామే జాతీయ జెండా ఎగురవేస్తామని స్పష్టంచేశారు.