అంతర్గత భద్రతపై కలిసి పనిచేద్దాం
– దేశాభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరం
– అంతరాష్ట్ర మండలి భేటీలో ప్రధాని మోదీ ఉద్భోద
న్యూఢిల్లీ,జులై 16(జనంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసి కట్టుగా పనిచేస్తేనే దేశం పురోగతి సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరమని ప్రధాన అన్నారు. శనివారం రాష్ట్రపతిభవన్‌లో జరుగుతున్న అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో మోదీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విస్తృత చర్చల ద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విధానాలు సక్రమంగా అమలు కావాలంటే రాష్ట్రాల పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. ఈ దశలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. పథకాల అమలులో సమస్యలుంటే చర్చలతో పరిష్కరించుకోవచ్చని మోదీ అన్నారు. కిరోసిన్ వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సబ్సిడీ, నగదు చెల్లింపులకు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఆధార్ అనుసంధానంతో నిధులు దారి మళ్లకుండా అరికట్టవచ్చన్న మోదీ 79 శాతం మంది వద్ద ఆధార్ కార్డులున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రాష్ట్రాధిపతులు, దేశాధిపతులు కలిసి సమావేశాలు నిర్వహించే సందర్భాలు అరుదుగా ఉంటాయన్నారు. భారత్ లాంటి అతి పెద్ద దేశంలో చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానాలను రూపొందించాలని మాజీ ప్రధాని వాజ్‌పేయి అన్నారని మోదీ గుర్తు చేశారు. రాష్ట్రాల నుంచి 21 శాతం నిధులు అధికంగా వచ్చినందుకు సంతోషంగా ఉందని మోదీ అన్నారు. దేశంలోని అంతర్గత భద్రతకు ఎదురువుతున్న సవాళ్లను పరిష్కరించాల్సి ఉందన్నారు. అంతర్గత భద్రతను పటిష్టం చేసేంత వరకు, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ కష్టంగా మారుతుందన్నారు.
14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రా/-రాలకు నిధులు పెంచామని వెల్లడించారు. విధానాలు సక్రమంగా అమలు కావాలంటే రాష్ట్రాల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. ఆధార్ అనుసంధానంతో అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చవచ్చన్న ప్రధాని.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. కేంద్రం అందిస్తున్న ప్రతి రూపాయి పేదవాడికి అందడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. 17 మంది కేంద్రమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, శాశ్వత సభ్యులు హాజరుకాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపి సిఎం అఖిలేష్,కర్నాటక సీఎం సిద్ధిరామయ్య గైర్హాజరయ్యారు. ఇందులో ఫూంచ్ కమిషన్ సిఫారసులు, అంతర్గత భద్రత, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
మోడీతో కెసిఆర్ కరచాలనం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలకరించారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరుగుతోన్న సమావేశానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరైన విషయం తెలిసిందే. ఈమేరకు సమావేశం సందర్భంగా హాల్ లో మోదీకి సీఎం కేసీఆర్ ఎదురయ్యారు. షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించి అభినందించారు. కాగా, ఒక సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ అట్రాక్షన్‌గా మారారు.