ఉచిత ఇసుక ఉత్తమాటే
నవంబర్ 14(జనంసాక్షి)
ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఆ పథకం అమలును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్‌రెడ్డి సర్కారు హామీ ‘నీటిపై రాత’లా మిగిలిపోయింది. లబ్ధిదారులను అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఉచిత ఇసుక కోసం టోకెన్ అందుకోవడం ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్నంత పని అవుతున్నది. చివరికి టోకెన్ దొరికినప్పటికీ రవాణా ఖర్చుల పేరుతో బహిరంగ మార్కెట్ ధరను వసూలు చేస్తున్నారు.
ఇదే అదునుగా టీజీఎండీసీ అధికారులు ఇసుకను దళారులకు అమ్ముకుంటున్నారు. స్థూలంగా చెప్పాలంటే ఉచిత ఇసుక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కన్నా అధికారులకే ఉపయోగకరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు తమ ఇంటి మంజూరు పత్రాన్ని తీసుకొని స్థానిక తాసిల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఒక్కో ఇంటికి 40 టన్నుల చొప్పున ఇసుక పొందేందుకు టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. కానీ, ఇది పెద్ద ప్రహసనంలా మారింది.
లబ్ధిదారులు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్తే.. తమకు సంబంధం లేదని, మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. అక్కడికి వెళ్తే తిరిగి ఎమ్మార్వో కార్యాలయానికే వెళ్లాలని చెప్తున్నారు. ఇలా రోజుల తరబడి ఎన్నో ప్రయాసలు పడ్డాక చివరికి టోకెన్ లభించినప్పటికీ రవాణా ఖర్చుల పేరుతో ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. దీంతో ఉచిత ఇసుక పేరుకే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని, బహిరంగ మార్కెట్ ధరకే తమకు ఇసుక ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరా బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కానీ, వారు ఆ బాధ్యతలను తాసిల్దార్లకు అప్పగించి చేతులు దులుపుకోవడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు.
ఉచితం మాటున భారీ దందా
తాసిల్దార్లు, టీజీఎండీసీ అధికారులు కుమ్మక్కై ఇసుక దందా చేస్తున్నారు. రీచ్‌ల వద్ద ఉచిత ఇసుకను టోకెన్ల ద్వారా లారీల్లో లోడింగ్ చేయించి భారీ మొత్తంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల వర్షాల అనంతరం ఇసుక ధర అమాంతం పెరిగి టన్ను రూ.3 వేల వరకు చేరుకున్నది. సాధారణంగా బహిరంగ మార్కెట్‌లో ఇసుక అమ్ముకునేవారికి టన్నుకు రూ.400 చొప్పున 35 టన్నులకు టీజీఎండీసీ రూ.14 వేలు (జీఎస్టీ అదనం) వసూలు చేసి కూపన్లు జారీ చేస్తుంది. కానీ, ఉచిత ఇసుక పథకం వచ్చాక టీజీఎండీసీ ఇసుక విక్రయాలను పూర్తిగా తగ్గించింది. అదేమంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని చెప్తున్నది. కానీ, మంజూరైన, నిర్మాణంలో ఉన్న ఇండ్లకు టీజీఎండీసీ సరఫరా చేస్తున్న ఇసుకకు మధ్య పొంతన లేకుండా ఉంది. ఉచితం పేరుతో అధికారులు ఇష్టారాజ్యంగా ఇసుకను లారీల్లో లోడింగ్ చేయిస్తున్నారని, దీంతో టీజీఎండీసీకి రావాల్సిన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని సాక్షాత్తూ ఇసుక వ్యాపారులే చెప్తున్నారు.



