కాసిపేటలో గుట్టలు మాయం

 

 

 

 

 

 

కాసిపేట, నవంబర్ 14(జనంసాక్షి) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ శివారు గుట్టలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం ప్రకృతి అందాలతో ఉన్న సంపదను కొల్లగొడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్థానికులు సమాచారం ఇచ్చినా ‘మాములు’గా తీసుకొని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

కొద్దిరోజులుగా కాసిపేట మండలంలోని గుట్టలను తవ్వి బండను అక్రమంగా తరలిస్తున్నారు. రోజువారీ తంతుగా ఈ అక్రమ తరలింపు జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై స్థానిక ఆదివాసీ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బండ తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానిక ఆదివాసీ గిరిజనులు అడ్డుకున్నారు. గుట్టలను తవ్వి బండను తీసి అక్రమంగా తరలించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు వారీగా ఈ తంతు సాగుతున్నా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. చాలా సార్లు ట్రాక్టర్లలో అక్రమంగా బండ తరలిస్తున్న వారికి తీయద్దు అని చెప్పినా కొన్ని రోజులు ఆపడం.. మళ్లీ తీయడం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. అధికారులకు తెలిపితే అసలు పట్టించుకోవడం లేదని, ఇంత ఘోరంగా ఉండటమేంటని అధికారుల తీరుపై మండి పడుతున్నారు. బండ కోసం మొత్తం గుట్టలను ఎక్కడికక్కడ తవ్వకాలు చేసి గుట్టలను మాయం చేస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.