జూబ్లీహిల్స్‌ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది

 

 

 

 

 

 

13(జనంసాక్షి)జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నయం బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చారని తెలిపారు. ఇది నిజంగా తమకు సానుకూలమైన అంశమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల సందర్భంగా .. నియోజకవర్గ స్థానిక నాయకత్వం అద్భుతంగా కష్టపడిందని అన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అద్భుతంగా పనిచేశారని.. పోరాటం చేశారని అన్నారు. ఆమెకు అభినందనలు చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను అద్భుతంగా పోషించిందని కేటీఆర్‌ తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టడంలో బలంగా బీఆర్ఎస్‌ పనిచేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది కొనసాగుతుందని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో నిజాయతీగా కొట్లాడమని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసని అన్నారు. ప్రతి సర్వేలో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఎలా చెప్పింది.. ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో ప్రజలు చూశారని అన్నారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయం బీఆర్ఎస్‌నే అని ప్రజలు స్పష్టం చేశారని తెలిపారు.

2014 నుంచి 2023 వరకు దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగాయని కేటీఆర్‌ తెలిపారు.ఈ ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదని గుర్తుచేశారు. దాదాపు ఐదింటిలో తాము గెలిచామని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలో కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఒకటి రెండు సీట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజల తరఫున వాదనను బలంగా వినిపించామని కేటీఆర్‌ తెలిపారు. ప్రజా సమస్యలను, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లామని పేర్కొన్నారు. హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చనీయాంశంగా చేయగలిగామని అన్నారు. ఇది బీఆర్‌ఎస్‌ సాధించిన విజయమని స్పష్టం చేశారు.

డైవర్షన్‌ రాజకీయాలు చేయలేదు

ఎన్నికల్లో లబ్ధి కోసం కులం, మతం పేరుతో డైవర్షన్‌ రాజకీయాలు చేయలేదని కేటీఆర్ తెలిపారు. బూతులు అస్సలు మాట్లాడలేదని పేర్కొన్నారు. హుందాగా కేవలం ప్రజాసమస్యలపై మాత్రమే కొట్లాడామని తెలిపారు. జనాలకు అవసరమైన పాయింట్లను మాత్రమే చర్చకు పెట్టామని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎంత కవ్వించేందుకు యత్నించినా కూడా సమన్వయం పాటించామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో కూడా తెలిపామని అన్నారు. 5328 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లెక్కలతో సహా ప్రజల ముందు పెట్టామని అన్నారు. కాంగ్రెస్‌ ఎగ్గొట్టిన వాటిని కూడా లెక్కలతో సహా ఇంటింటికీ తీసుకెళ్లామని తెలిపారు.

‘ బస్సు చార్జీల పెంపుపై నిరసన, బస్తీ దవాఖానాల్లో పర్యటించి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చాం.. హైడ్రా విధ్వంసంపై ప్రభుత్వాన్ని ఎండగట్టాం.. ఆటో అన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితి విషయంలో కూడా ప్రభుత్వాన్ని కదిలించాం. శాంతి భద్రతల విషయంలో కూడా మా నిరసనను తెలిపాం.’ అని కేటీఆర్ తెలిపారు. ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హుందాగా నిర్వహించిందని అన్నారు. తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడకతప్పని అనివార్యత కల్పించామని తెలిపారు. రెండేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయని ముఖ్యమంత్రి.. ఆఖరి రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయని పరిస్థితి వచ్చిందంటే అది బీఆర్ఎస్‌ విజయమే అని స్పష్టం చేశారు. రెండేళ్లలో మైనార్టీలకు స్థానం లేదు.. దీనిపై బీఆర్‌ఎస్‌ గట్టిగా మాట్లాడి.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిన అనివార్యతను కల్పించామని అన్నారు.