రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

చేర్యాల నవంబర్ 07, (జనంసాక్షి) :
కడవేరుగు రోడ్డుకు మరమ్మతులు చేయరు..?
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేరుగు-నాగపురి రహదారి కోతలకు గురై ప్రమాదాలకు నిలయంగా మారిందని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. శుక్రవారం కోతకు గురైన రోడ్డును సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేర్యాల పట్టణ కేంద్రం నుండి కడవేర్గు-నాగపురి గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రహదారి పూర్తిగా గుంతల మయంగా మారడంతో నిత్యం రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది కరంగా మారింది. రోడ్డు ఇరువైపులా, మధ్య భాగంలో గుంతలు ఏర్పడి నీరు నిండిపోవడంతో వాహనదారులు గుంతలో పడి ప్రమాదాలకు గురై ఎంతో మందికి గాయాలైన సంఘటనలు నెలకొన్నాయి. ప్రయాణం చేయాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుందని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాల కారణంగా రహదారి కోతకు గురవడంతో రాత్రి వేళల్లో ఆదమరిస్తే అంతే అని వాహనదారులు బెంబేలు పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ అధికారులు స్పందించి గుంతలమయమైన రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, వలబోజు నర్సింహా చారి, నంగి కరుణాకర్, నర్సిరెడ్డి, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.



