అనాధలుగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు

సకాలంలో అందని సాయం
అనంతపురం,పిబ్రవరి20(జ‌నంసాక్షి):జిల్లా రైతుల దుర్భర పరిస్తితులు జీవన చిత్రానికి అద్దం పడుతోంది. వ్యవసాయం తప్ప ఇతర విషయాలు తెలియని సామాన్య రైతులు సైతం భూమి లేకున్నా.. కౌలు సాగును బతుకుదెరువుగా చేసుకున్నారు. చినుకు రాలని నేలనే నమ్ముకుని ఏటా సాగుతో రుణ పడిపోతున్నారు. శక్తికి మించిన రుణం తీర్చలేక, కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలే శరణ్యంగా కొందరు జీవితం చాలిస్తున్నారు. యజమానిని కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు అనాథలుగా మారారు. వీరికి ప్రభుత్వ
సాయం అందక అష్టకష్టాలు పడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం చేకూరలేదని వేదనకు గురవుతున్నారు. రెవెన్యూ అధికారులు విచారణ కూడా జరిపి ఉన్నతాధికారుకలు నివేదికలు పంపారు. అధికారులు పంపిన నివేదికల్లో దొర్లిన పొరపాట్లతో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు
కుటుంబాల బాధితులు ఆర్థిక సాయానికి దూరమయ్యారు.  డాక్యుమెంట్లలో కొన్నింటిని సమర్పించలేక అవస్థ పడుతున్నామని వాపోతున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువరైతు భార్యకు ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, వితంతు పింఛను పథకం కింద సాయం అందిస్తుంది. ఆ సాయానికి కూడా దూరంగా ఉన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని ఆత్మహత్యల ఘటనలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు వివరాలను సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. వరుస కరవులతో అప్పులపాలై అసువులు బాస్తున్నారు. కుటుంబ పెద్ద బలవన్మరణంతో సభ్యులు వీధిన పడుతున్నారు. రుణాలను వారసత్వంగా పొందిన కుటుంబ సభ్యులు వాటిని తీర్చే దారిలేక  అలమటిస్తున్నారు. అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా.. ఎలాంటి స్పందన కనిపించలేడంలేదు. కూలి పనులతో పిల్లలను చదివించుకుంటూ బతుకీడుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి కుటంబాలను గుర్తించి సాయం అందేలా చూడాలని కోరుతున్నారు.