అనుమతి ఇవ్వటంలోనే కుట్ర: కోమటి రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు అనుమతి పేరున తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్నినట్టు కనబడుతోందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మార్చ్‌కు అనుమతి లేదని కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలను అరెస్టు చేసి స్టేషన్లలో నిర్భంధించి వేధించారని ఆయన ధ్వజమెత్తారు. ఇన్ని నిర్భంధాల మధ్య ప్రజలు లక్షాలదిగా కదిలే అవకాశం ఉందని నివేదికలు అందడంతో తెలంగాణ మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్ని అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేశారని పేర్కొన్నారు. రైళ్లును బంద్ చేయడం, బస్సులను నడపనీయక పోవడం, కాలిరడకన వచ్చే వాళ్లను పోలీసులు అరెస్టు చేసి నిర్బందిండమేంటని ఆయన ప్రశ్నించారు. మంత్రులు అనుమతిప్పించామని చంకలు గుద్దుకోవడం కాదు, మీ మాటలను లెక్క చేయకుండా అరెస్టులతో అడ్డుకుంటుంటే ప్రభుత్వంలో ఉండేదుకు సిగ్గుండాలని ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సీమాంధ్ర పాలకుల కుట్రలలో భాగం కాలేకనే రాజీనామా చేసి బయటకు వచ్చి ప్రజలతో ఉన్నానని ఆయన వివరించారు. ఇకనైన తెలంగాణ మంత్రులు కండ్లు తెరిచి బయటకు రావాలని డిమాండ్ వ్యక్తం చేశారు.