అమరావతి రాజధాని ఉద్యమానికి 600 రోజులు
నేడు పలు ఆందోలన కార్యక్రమాలకు రైతుల పిలుపు
రాజధాని లేకుండా ఎంతకాలం ఇలా అని ఆవేదన
అమరావతి,ఆగస్ట్7(జనంసాక్షి): అమరావతి రాజధాని పోరాటం ఆదివారానికి 600 రోజుకు చేరుకోనుంది. . ఉద్యమ కార్యాచరణను అమరావతి జేఏసీ రాజధానిని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో బైక్ ర్యాలీ జరగనుంది. హైకోర్టు దగ్గర ఉన్న జడ్జి క్వార్టర్ల నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ జరగనుంది. మార్గమధ్యలో చర్చి, మసీదులను సైతం రైతులు సందర్శించనున్నారు. రాజకీయ వికృత క్రీడలో అమరావతిని బలిపీఠం ఎక్కించాలని సీఎం జగన్‌రెడ్డి చూస్తున్నారని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఉద్యమం శుక్రవారంతో 598వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం మూడు ముక్కల ఆట ఆడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారే సంస్కృతికి చెక్ పెట్టాలని, లేదంటే ఇది ఇతర రాష్టాల్రకు పాకి ప్రమాదకరంగా మారుతుందన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి జగన్ ధోరణి కారణంగా భూములు ఇచ్చిన రైతులు గత 600 రోజులుగా ఆందోళన చేస్తున్నా..ఏ ఒక్కరోజు కూడా వారిని జగన్ పరామర్శించక పోవడం విచారకరం. ఈ సమస్యపై వారితో ఏనాడూ చర్చించలేదు. దీనికితోడు ఏ ఒక్క కంపెనీ కూడా రాష్టాన్రికి రావటం లేదు. ప్రజా సంక్షేమం అంటూ నగదును పంచి ప్రజలకు శాశ్వత ఉపాధి మార్గాన్ని సీఎం జగన్‌రెడ్డి దూరం చేస్తున్నారని దళిత జేఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని నాశనం చేయటంతోనే సీఎం జగన్‌రెడ్డి పతనం ప్రారంభమైందన్నారు. 80 శాతం భూములు రాజధానికి ఇచ్చింది దళిత బహుజనులే అయినా సామాజిక వర్గమనే కుట్ర పన్నారన్నారు. అమరావతిని నాశనం చేయాలని చూసిన వారు ఎవరైనా మట్టి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. అమరావతిని కట్టలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి.. మూడు ముక్కలు ఆట ఆడుతున్న సీఎం మాకొద్దు.. రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి.. అంటూ సీఎంకు వ్యతిరేకంగా మందడం ధర్నా శిబిరంలో మహిళలు, రైతులు నినాదాలు చేశారు. శుక్రవారం క్యాబినెట్ సమావేశం సందర్భంగా మందడం రైతు శిబిరం విూదగా సీఎం కాన్వాయ్ వెళ్ళే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో దుకాణాలు మూయించి, ధర్నా శిబిరం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సచివాలయం నుంచి సీఎం తిరిగి వెళ్లే వరకు గ్రామంలో పోలీసులు ఆంక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా ధర్నా శిబిరంలో మహిళలు మాట్లాడుతూ శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే సీఎం జగన్‌రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే వందల మంది పోలీసు బలగాలతో పరదా మాటున వెలగపూడి సచివాయానికి వెళుతున్నారని విమర్శించారు. అమరావతి అంటేనే జగన్‌రెడ్డికి పడదని, అందుకే నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.