ఆంధ్రా ‘బాబు ‘ ఆపు నీ డ్రామా !

800 వందల మంది ఆత్మబలిదానాలకు కారణం నువ్వే
బైరెడ్డి బాగోతం సుత్రదారికి నువ్వేనంటూ
తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ టీడీపీ ఆఫీస్‌ ముందు ధర్నా
హైద్రబాద్‌, ఆగస్టు30(జనంసాక్షి):
ఆంధ్రా బాబు చంద్రబాబు తన డ్రామాలు కట్టిపెట్టి తెలంగాణకు మద్దతుగా డిక్లరేషన్‌ ఇవ్వాలని తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. గురువారం టీడీపీ ఆఫీసును తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన 800 మంది ఆత్మహత్యలకు బాబే కారణమంటూ వారు మండి పడ్డారు. 2009 ఎన్నికలపుడు తెలంగాణకే మా మద్దతు అన్న బాబు కేంద్రం డిసెంబర్‌ 9 ప్రకటన చేయగానే తన మాట మార్చాడని మండిపడ్డారు. రెండు కళ్ల సిద్దాంతంతో తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలకు బాబు కారణమవుతున్నా డన్నారు. తెలంగాణను అడ్డుకొ నేందుకే బాబు సీమాంధ్రకు చెందిన బైరెడ్డిని ప్రోత్సా హిస్తున్నాడని అడ్వకేట్‌ జేఏసీ నాయకులు ఆరోపిం చారు. చంద్రబాబుకు చిత్తశుద్ది తెలంగాణకు మద్దతుగా కేంద్రానికి లేఖ రాయాలంటూ సవాల్‌ విసిరారు. తెలంగాణ సాధన కొరకు జరుగుతున్న పోరాటాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాడంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి దీక్షల వెనక చంద్రబాబు ఉన్నాడన్నది స్పష్టంగా తెలుస్తునే ఉందన్నారు. తన రెండు కళ్ల సిద్దాంతంతోనే తెలంగాణలో అడ్రస్‌ లేకుండా పోయాడన్నారు. ఇప్పటికైనా బాబు తెలంగాణకు మద్దతుగా ఓ డిక్లరేషన్‌ ఇవ్వాలని, చిదంబరానికి లేఖరాయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే తెలంగాణలో బాబును తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించిన న్యాయవాదులు పార్టీ ఆఫీసులోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకొన్నారు. అయినప్పటికీ లోనికెళ్లేందుకు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపించివేశారు.