ఆత్మపరిశీలన చేసుకోని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

ఎమ్మెల్యేలు జారిపోతున్నా పట్టించుకోని వైనం
రేపటి లోక్‌సభలోనూ అసెంబ్లీ ఫలితాలే పునరావృతం
హైదరాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): దేశంలో నాయకత్వ సమస్యలో ఉన్న కాంగ్రెస్‌ తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో వాటిని ఎదుర్కొనే వ్యూహంలో విఫలం అవుతున్నాయి. కాంగ్రెస్‌ను వెన్నాడుతున్న పాపాలను కప్పిపుచ్చు కునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణలో కెసిఆర్‌ ఏవిూ చేయడం లేదని చెబుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇప్పుడు మండలి ఎన్నికల ముందు కూడా గెలిచిన ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి వలసబాట పట్టడంతో తలెత్తుకోలేక పోతోంది. దీనంతటికి నాయకత్వ సమస్య  ప్రధాన కారణం. నాయకుడు గట్టిగా ఉంటే ఇలాంటి సమస్యలు రావు. అన్నింటికి మించి తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకోవడంతో గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు 9న శంషాబాద్‌లో  రాహుల్‌ బహిరంగ సభ కోసం తెలంగాణ పిసిసి భారీకసరత్తు  చేసినా పెద్దగా స్పందన రాలేదు. దీనిపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘాటుగానే స్పందించారు. రాహుల్‌ సభను కూడా విజయవంతం చేయలేని నాయకత్వం ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉత్తమ్‌ నాయకత్వంపై మాత్రం సమస్యలు ఉన్నాయి. ఉత్తమ్‌ అసలు సమస్య అంటూ చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా చూడాలి. ఎమ్మెల్యేలు ఎందుకు జారిపోతున్నారో ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు.   తెలంగాణలో పిసిసి నాయకత్వం మారితే తప్ప ఫలితం ఉండదని చెబుతున్నారు. సైద్ధాంతికంగా, వ్యూహా త్మకంగా అవసరమైన మార్పులకు సిద్ధపడతామో లేదో తేల్చుకోవాలని సూచిస్తున్నారు. అసలు నాయక త్వం వహించడం మాట వదిలిపెట్టి మళ్లీ కూటమి దిశగా ఎత్తుగడలకు సిద్దపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం తప్పనిసరి. జరిగిన తప్పిదాలేమిటి? లోటుపాట్లేమిటన్న అంశాలను చర్చించడం కూడా అవసరం. కానీ కాంగ్రెస్‌ తాను వీటన్నిటికీ అతీత మన్నట్టు వ్యవహరిస్తున్నారు.  గుణపాఠం నేర్చుకునే అవకాశాలను పక్కన పెట్టారు. కాంగ్రెస్‌ గత పాపాలను విస్మరించి మాట్లాడితే ప్రజలు నమ్మరని గ్రహించడం లేదు. అందుకే గతాన్ని మరుగున పరచాలనుకున్న వారికి కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. పార్టీ ఇప్పుడున్న తీరు సరిగా లేదని నేతలే అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతన్న ఈ దశలోనైనా సమూల ప్రక్షాళనకు సంసిద్ధం కాకపోతే పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని కాంగ్రెస్‌ నేతలు గ్రహించడం ప్రధానంగా తెలంగాణలో ఆత్మపరిశీలన చేసు కోవడం అవసరం. లేకుంటే ఉన్న ఎమ్మెల్యేలు గోడదూకడం ఖాయం.  సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, ఇతర పార్టీల నుంచి అసంతృప్తులను తమవైపు తిప్పుకోవాలని కసరత్తు ప్రారంభించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా… క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడానికి పార్టీ నేతలు యత్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను ముందుగానే ఖరారు చేస్తామన్న ప్రకటనలు ఆచరణలో సాధ్యం కాలేదు.  పార్టీ అధిష్ఠానం అందరినీ సమన్వయపరిచే నాయకుల కోసం వెతుకుతోంది. క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం… అన్ని వర్గాలను కలుపుకుపోగల సమర్థత, జిల్లా రాజకీయాల్లో వర్గ విభేదాలను పక్కనబెట్టి అంగ, అర్థ బలాల్లో గట్టిగా ఉన్నవారినే పార్టీ అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు తెలిసింది.  కార్యకర్తల్లో నైతికసైర్థ్యం నింపేలా నాయకత్వం పనిచేయాలని పార్టీ అధిష్ఠానం ఇటీవలే గట్టిగా హెచ్చరించింది.  వర్గవిభేదాలు పక్కన పెడితేనే అధికార పార్టీని ఢీకొనగలమని అంటున్నారు.  ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.