ఆదివాసీల అభివృద్ధి కోసమే..  పార్టీ మారుతున్నాం


– ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధం
– అమ్ముడుపోయామనడం సిగ్గుచేటు
– కాంగ్రెస్‌ రూ.50 లక్షలు ఆఫర్‌ చేసింది
– అమ్ముడుపోయే తత్వమే ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండేవాళ్లం
– మా ప్రాంతాల అభివృద్ధికి కేసీఆర్‌ హావిూఇచ్చారు
– కాంగ్రెస్‌లో 16మందికి నాలుగు గ్రూపులున్నాయి
– ఇప్పటికైన అధినాయకత్వం మేల్కోవాలి
– కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సక్కు
హైదరాబాద్‌, మార్చి4(జ‌నంసాక్షి) : ఆదివాసీల అభివృద్ధి కోసమే తాము అధికార పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని, మా ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ సహకరించారని హావిూ ఇచ్చారని పినపాక ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కులు అన్నారు. సోమవారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ రూ. 50 లక్షల చొప్పున ఆఫర్‌ చేసిందని తెలిపారు. ఒక వేళ డబ్బులకు అమ్ముడుపోవాలనుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీతోనే రూ. 50లక్షలు తీసుకునే వాళ్లం కదా అని రేగా కాంతారావు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తమకు ఎలాంటి డబ్బు ఆఫర్‌ చేయలేదని, కేవలం ఆదివాసీల అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని తేల్చిచెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతామని తాము ఇప్పటికే చెప్పామని గుర్తు చేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క అసత్యాలు మాట్లాడుతూ.. ఎంతకు అమ్ముడు పోయారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉత్తమ్‌, భట్టి మాట్లాడారని, వారిద్దరూ తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, యాదవరెడ్డిని ఎంతకు కొనుగోలు చేశారని రేగాకాంతారావు ఉత్తమ్‌ను ప్రశ్నించారు. సంఖ్యా బలం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు. తనతో పాటు ఆత్రం సక్కు, సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరితో కాంగ్రెస్‌ బలం 16కు పడిపోతుందన్నారు. ఉన్న 16 మంది ఎమ్మెల్యేల్లో నాలుగు గ్రూపులున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా అగ్ర నాయకత్వం ఆలోచించాలని రేగా కాంతారావు సూచించారు. సమయం వచ్చినప్పుడు రాజీనామా చేస్తామని వారు స్పష్టం చేశారు. సమస్యలపై సీఎంను కలవడానికి కూడా కాంగ్రెస్‌ అనుతివ్వలేదన్నారు. మమ్మల్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌ రాజకీయం చేయాలని చూస్తోందని విమర్శించారు.

తాజావార్తలు