ఆధార్‌ అనుసంధానం వేగం చేయాలి

విజయవాడ,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ఓటరు ఐడీ సంఖ్యతో సంబధిత ఓటరు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసే ప్రక్రియను  ఆగస్టు 15 నాటికల్లా పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్‌ బాబు తెలిపారు. దీంతో ప్రతి ఒక్కరూ ఇందులో లక్ష్యం మేరకు ముందుకు సాగాలన్నారు.  ఎపిక్‌ ఆధార్‌ సీడింగ్‌ పక్రియను తక్షణమే అన్ని మండలాల్లో ప్రారంభించాలని కలెక్టర్‌  అధికారులను ఆదేశించారు. దేశ వ్యాప్తంగా 85 కోట్ల మంది ఓటర్ల ఆధార్‌ సీడింగ్‌ పక్రియను భారత ఎన్నికల సంఘం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.  జిల్లాలో 33,41,190 మంది ఓటర్లు ఉండగా, 43 లక్షల మంది ప్రజలు ఆధార్‌ కార్డు నమోదు చేసుకున్నారు. వయోజనులైన వారి ఆధార్‌ కార్డు సంఖ్యను, ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను అనుసంధానించే పనిని క్షేత్రస్థాయిలో వీఆర్వోలు, బీఎల్‌వోలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు వారికి లాగిన్‌ పాస్‌వర్డ్‌, ఐడీ ఇవ్వనున్నారు.  సీడింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన విధానాన్ని కలెక్టర్‌ అధికారులందరికీ సోదాహరణంగా వివరించారు. ఓటర్లు వారి మొబైల్‌ యాప్స్‌ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ ద్వారా, కాల్‌ సెంటర్‌ టోల్‌ఫ్రీనెంబరు 1950కు కాల్‌ చేయడం ద్వారా స్వయంగా ఆధార్‌ సీడింగ్‌ను చేసుకోవచ్చు.