ఆనం సోదరులు రాజీనామా చేయాలి మేకపాటి చంద్రశేఖరరెడ్డి

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : నెల్లూరు లోక్‌ సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌  పార్టీ ఓడిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు.  శుక్రవారం రాత్రి జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మీద, రాజశేఖరరెడ్డి కుటుంబం మీద ఆనం సోదరులు చేసిన అనుచిత వ్యాఖ్యాలకు ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పారని అన్నారు. శుక్రవారం వెలువడిన ఫలితాలను పరిశీలిస్తే 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్త్తోందని అన్నారు. ఇప్పటికైనా ఆనం సోదరులు తమ నోళ్ళను అదుపులో పెట్టుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల మర్యాదగా  ప్రవర్తించాలని  లేకుంటే ఇక  పార్టీ కార్యకర్తలే రంగంలోకి దిగి వారికి మరోమారు గుణపాఠం చెప్పా ల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నెల్లూరు రూరల్‌ ఇన్‌చార్జి ఆనం వెంకటరమణారెడ్డి, నెల్లూరు నగర ఇన్‌చార్జి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.