ఆపరేషన్లు చేస్తున్న వార్డ్‌బాయ్‌ సస్పెన్షన్‌

లక్నో, జూలై 13 : యుపిలోని బులంద్‌షహర్‌ పట్టణంలో ఆపరేషన్లు చేస్తున్న వార్డ్‌బాయ్‌ను యుపి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌పై కూడా ఈ చర్య తీసుకున్నారు. కుట్లు వేస్తున్న వార్డ్‌బాయ్‌ను సస్పెండ్‌ చేసినట్లు యుపి ఆరోగ్యమంత్రి అహ్మద్‌ హసన్‌ విలేకరులకు చెప్పారు. సూపరింటెండెంట్‌ సమక్షంలో ఇలాంటి అకార్యాలు జరగటం క్షంతవ్యం కాదని అందువల్ల ఆయనపై కూడా వేటు వేశామని మంత్రి వెల్లడించారు. హెల్త్‌కేర్‌ రంగంలో చాలా అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పుకున్నారు. అత్యుత్తమ ఔషధాలను అందుబాటులో ఉంచామని అవినీతిపరులైన అసమర్ధులైన డాక్టర్లను తొలగించామని తెలిపారు. బులంద్‌షహర్‌లో వార్డుబాయ్‌లు, స్వీపర్లు ఆపరేషన్లు చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. గాయపడిన చిన్నారికి ఒక వార్డుబాయ్‌ కుట్లు వేయటం వీడియో తీసిన ఒకరు ఈ ఫుటేజ్‌ను టీవీ ఛానల్స్‌కు ఇవ్వటంతో బండారం బయటపడింది. మరో వార్డుబాయ్‌ ఇంజక్షన్‌ ఇస్తూ కెమెరాలో దొరికిపోయాడు. కాగా వారంతా శిక్షణ పొందినవారేనని ఆస్పత్రి అధికారులు సమర్దించుకున్నారు. టీవీలో ఈ దృశ్యాలు ప్రసారం కాగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.