ఆరో రోజుకు మున్సిపల్ కార్మికుల సమ్మె..

హైదరాబాద్ : న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మిక సంఘాలు (జెఎసి) చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మిక సంఘాలను బెదిరింపులతో లొంగదీసుకొనే చర్యలన్నీ పటాపంచలయ్యాయి. బేరసారాలను తిప్పికొట్టాయి. కనీస వేతనాలు ఇచ్చేంత వరకు తాము సమ్మెను విరమించేది లేదని ప్రకటించాయి. కానీ సమ్మెలోకి రెండో రోజు వచ్చిన జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ మధ్యలోనే వెళ్లిపోయింది. సమ్మె ప్రభావంతో నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్థంగా మారిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ అందులో విఫలమైంది. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు స్పష్టం చేశారు. నగరంలోని రాంనగర్ లో భారీ ఎత్తున కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాపార్కు వద్ద కార్మికులు భారీ ధర్నా చేపట్టనున్నారు. టీఆర్ఎస్ పార్టీతో తొత్తుగా ఉన్న సంఘం గుర్తింపే లేదని సీపీఎం నేత పేర్కొన్నారు. రెట్టింపు జీతం ఇస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొంటున్నారని, ఆ డబ్బులు ఎక్కడవని ప్రశ్నించారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇది సబబు కాదన్నారు. వెంటనే న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.