ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ ఆచూకి లభ్యం

ఊపిరిపీల్చుకున్న పోలీసులు, కార్యకర్తలు
బెంగళూరు, ఆగస్టు 3 : ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ క్షేమం.. ఊపిరి పీల్చుకున్న మంత్రులు, పోలీసులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు. శుక్రవారం ఉదయం నజారాబాద్‌లోని తన సోదరిని ఇంటి నుంచి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లడం, తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆచూకి కోసం ప్రభుత్వం, పోలీసులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఆయన నివసిస్తున్న ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరమ్‌జాకిరే పీపుల్స్‌పార్కులో ఆయన ఒక బెంచిపై కూర్చుని ఉండడాన్ని కనుగొన్నారు. ఆయనను నివాసానికి తరలించారు. సుదర్శన్‌ ఆచూకి లభ్యమవడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, వయోభారం వల్ల 81 ఏళ్ల సుదర్శన్‌కు మతిమరుపు ఉన్నదని, రోజు మాదిరిగానే వాకింగ్‌కు వెళ్లి, మూడు గంటల పాటు తిరిగి రాకపోవడంతో ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తిరిగి ఇంటికి చేరుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.