ఆలస్యమైతే రేవంత్‌కు ఆశాభంగమేనా..!

– ఇప్పటికిప్పుడు కొడంగల్‌లో ఎన్నికవస్తే గెలుపు రేవంత్‌దే
– ఆలస్యమైనాకొద్దీ పెరుగనున్న తెరాస ప్రాబల్యం
– కొడంగల్‌ నియోకవర్గంపై తెరాసా ప్రత్యేక దృష్టి
– రేవంత్‌ నియోజకవర్గంలో సర్వే ఫలితమేంటి?
హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రాజీనామా ఆమోదం పొందుతుందో లేదో తెలియదు కానీ.. రేవంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కొడంగల్‌ కు ఉప ఎన్నిక పై అందరి
ఆసక్తి నెలకొని ఉంది. అక్కడ రేవంత్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి నెగ్గుతాడా? అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. మరి సొంత నియోజకవర్గంలో నెట్టుకు రాగలను అనే ధైర్యమే లేకపోతే రేవంత్‌ రెడ్డి తెలుగుదేశానికి రాజీనామా చేసే పరిస్థితే ఉండకపోవచ్చు. ముందస్తుగా నియోజకవర్గంలో పరిస్థితిని రేవంత్‌ రెడ్డి సవిూక్షించుకున్నారని తెలుస్తోంది. విజయం ఖాయమనే అంచనాకు వచ్చాకే డేర్‌ గా ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఒక సర్వే కూడా చేయించుకున్నారట రేవంత్‌. దాని సారాంశం ఏమిటంటే….. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తే కనీసం 51 శాతం ఓట్లను పొందే అవకాశం ఉందని తేలిందట. తెలుగుదేశాన్ని వీడిన నేపథ్యంలో చాలా వరకూ క్యాడర్‌ తనతో పాటే ఉంటుందని రేవంత్‌ కు స్పష్టత వచ్చిందట. కొంత శాతం కాంగ్రెస్‌ లోకి రాకపోయినా.. వారి వల్ల పెద్దగా నష్టం లేదనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్‌
పార్టీ క్యాడర్‌ వెంట నిలుస్తుందనే ధీమా వ్యక్తం అవుతోంది రేవంత్‌ వర్గం నుంచి. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి రేవంత్‌ వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ నేపథ్యంలో మూడో సారి ఉప ఎన్నిక రూపంలో నెగ్గుకు రాగలనని రేవంత్‌ చేయించుకున్న సర్వేలో తేలిందట. 51 శాతం ఓటు బ్యాంకు రేవంత్‌ వెంటనుండగా, 34 శాతం మంది తెరాసకు మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని కూడా సర్వే తేల్చిందని తెలుస్తోంది. ఏతావాతా.. ఉప ఎన్నిక వస్తే రేవంత్‌ భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమనే ఈ సర్వే చెబుతోంది.
ఆలస్యమైతే ఆశాభంగమేనా..!
రేవంత్‌రెడ్డి రాజీనామా ఇప్పటి వరకు స్పీకర్‌ వద్దకు చేరలేదని తెలుస్తోంది.. ఒకవేళ చేరినా రాజీనామాను అంత త్వరగా ఆమోదించే పరిస్థితి కనిపించటం లేదు. ఒకవేళ రాజీనామా ఆమోదించకుండా ఆలస్యం చేస్తే కొడంగల్‌లో రేవంత్‌కు ఆశాభంగమే ఎదురయ్యే అవకాశాలుఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ కాంగ్రెస్‌ మార్పుపై ఊహాగానాలు వస్తున్న నాటి నుండి ఆ నియోజకవర్గంలో తెరాస గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెదేపా నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలను, ద్వితియశ్రేణి నేతలను తెరాస నేతలు తమ పార్టీల్లోకి చేర్చుకుంటున్నారు. దీనికితోడు ఎంత వీలైతే అంతమంది ఆ నియోజకవర్గంలోని తెదేపా, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను, ద్వితియశ్రేని నేతలను పార్టీలోకి తీసుకురావాలని ఇప్పటికే అధిష్టానం స్థానిక నేతలకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస ముఖ్యనేతలు కొడంగల్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరు అనేది లేకుండా ఎవరొచ్చిన పార్టీ కండువాలు కప్పుతున్నారు. రెండుమూడు నెలల్లో పూర్తిస్థాయిలో కొడంగల్‌పై పట్టుసాధించే దిశలో తెరాస నేతలు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. తద్వారా రేవంత్‌ రాజీనామా ఆలస్యంగా ఆమోదించబడి ఎన్నిక సమయం ఆలస్యమైనా కొద్దీ ఆ నియోజకవర్గంలో తెరాస పట్టు పెంచుకోవటమే కాకుండా.. రేవంత్‌కు బారీ సవాల్‌ను విసిరేందుకు సిద్ధమ్యే అవకాశాలు ఉన్నట్లు
పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాలను అంచనాలోకి తీసుకుంటే ఎన్నిక ఆలస్యమైనా కొద్దీ రేవంత్‌కు భంగపాటు తప్పదని స్పష్టమవుతోంది.

తాజావార్తలు