ఆసక్తిగా మారనున్న నగర రాజకీయాలు

హైదరాబాద్‌,నవంబర్‌21:అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్‌ నాయకులను వైఎస్‌ఆర్‌సీపీ ఆకర్షిస్తుండటంతో జంటనగరాల్లో ఎవరు అందులోకి వెళతారన్నది చర్చనీయాంశంగా మారింది.  సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర  గడువు ఉండగానే నగరంలో రాజకీయ వేడి పుట్టింది. అధికార పార్టీ దోస్తీకి మజ్లిస్‌ కటిఫ్‌ చెప్పినప్పటి నుంచి నగర రాజకీయ సవిూకరణాలు చకచకా మారుతున్నాయి. తెలంగాణ జిల్లాల మాదిరిగా తెలంగాణ ప్రభావం ఒక్కటే మహానగరంలో ఓటు- బ్యాంకుపై ప్రభావం చూపదని … వలస ప్రజలు మైనార్టీలు పుష్కళంగా ఉన్న నగర నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభావం కొంతైనా కచ్చితంగా ఉంటుందనే రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.నగరంలో మారుతున్న రాజకీయ సవిూకరణాలను పరిగణలోకి తీసుకుంటు-న్న గ్రేటర్‌ అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ నాయకులతో కొందరు కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం మజ్లిస్‌ అభ్యర్థి మేయర్‌ ఉండటం .. కాంగ్రెస్‌ , మజ్లిస్‌ల మైత్రి బంధం తెగిపోవడం వంటి అంశాలను వీరు నిశితంగా గమనిస్తున్నారు.  కొందరు నగర ప్రజాప్రతినిధులు పార్టీ వీడటంతో పాటు- నియోజక వర్గాన్నీ సైతం మార్చుకోవాలని చూస్తున్నట్టు- సమాచారం. నగర పరిధిలోమంత్రి ముఖేష్‌గౌడ్‌, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి , మల్కాజ్‌గిరి ఎమెల్యే ఆకుల రాజేందర్‌, కుత్బుల్లాపూర్‌ స్వతంత్ర ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌లు ‘వైఎస్‌ఆర్‌సీపీ’లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయంగా ప్రచారం జరుగుతోంది. ఎక్కడా ఇప్పటి వరకూ వీరు ఈ ప్రచారాన్ని అధికారికంగా ఖండించలేదు. పైగా ఆయా నియోజక వర్గాల్లోని అనుచరులతో వీరు సమావేశమై రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో తలమునకలై ఉన్నట్లు- సమాచారం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతిపై సైతం ఇదే విధంగా జోరుగా ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఈ ప్రచారానికి తెరదించారు.  ఈ రకమైన ప్రచారంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఓ మంత్రి ఇంతకు ముందే పార్లమెంట్‌ స్థానంపై కన్నువేసినట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలకు మజ్లిస్‌ మద్దతు ఉపసంహరించుకోవడం వల్లనే ముందస్తు వేడి పుట్టిందని  పేర్కొంటున్నారు.