ఆసక్తిరేపుతున్న ‘ధర్మాన’ కేసు

హైదరాబాద్‌ : వాన్‌పిక్‌ కేసులో రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణ కోసం సీడీఐ చేసుకున్న అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దాదాపు మూడు మాసాల విరామం తరువాత శుక్రవారం ఇక్కడ సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం సీబీఐ అభ్యర్థనను నిరాకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సమాచార కమిషనర్ల భర్తీలో ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికపై గవర్నర్‌ గతంలో విభేదించిన సంగతిగమనార్హం. దీంతో ప్రస్తుత పరిస్థితిలో ధర్మాన వ్యవహారంపై గరవర్నర్‌ నిర్ణయంపై కొందరు మంత్రులు సందిగ్ధావస్థలో ఉన్నారు. కేబినెట్‌ సిఫార్సును గవర్నర్‌ తిరస్కరించిన పక్షంలో ఆయన ఆమోదం కోసం కేబినెట్‌ మరోసారి అదే దస్త్రాన్ని పంపుతుంది. రెండవసారి దస్త్రాన్ని అందుకున్న తరువాత దానిపై సంతకం చేయడం తప్ప గవర్నర్‌కు మరో ప్రత్యామ్నాయం లేదు అని ఒక సీనియర్‌ మంత్రి వివరించారు. అయితే కేబినెట్‌ సిఫార్సును గవర్నర్‌ తిరస్కరించిన పక్షంలో ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కేబినెట్‌ సిఫార్సుతో గవర్నర్‌ విభేదించరనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి సన్నిహితులు వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ నుంచి తప్పించాలనే తన ప్రతిపాదన గురించి కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌ సమావేశానికి ముందే గవర్నర్‌కు తెలియజేశారు. అందుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని చెప్పారు.