
జీహెచ్ఎంసి ఆస్తిపన్ను మే 31వ తేదీలోగా చెల్లించిన వారిలో మల్కా.జిగిరి సర్కిల్ నేరేడ్‌మెట్ కాకతీయ నగర్‌కు చెందిన జి.బాపిరెడ్డి లక్షరూపాయల నగదు బంపర్ బహుమతి గెలుపొందారు. మే 29 నుండి 31 తేదీల మధ్య ఆస్తిపన్ను చెల్లించి వారికి ఐదు లక్షల రూపాయలను బహుమతిగా అందజేయనున్నట్టు జీహెచ్ఎంసి ప్రకటించింది. దీనికి స్పందించి 10,777మంది ఆస్తిపన్నును చెల్లించారు. వీరికి ముందుగా ప్రకటించిన వివిధ కేటగిరిలకు చెందిన ఐదు లక్షల రూపాయల బహుమతులను నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియోద్దీన్‌లు లాటరీ ద్వారా విజేతలను ప్రకటించారు. 50,000 రూపాయల మొదటి బహుమతిని ఆబిడ్స్ సర్కిల్ దయారాకు చెందిన పి.ఆశ గెలుపొందగా, 25,000రూపాయల రెండవ బహుమతులు రెండింటిలో ఖైరతాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన ఒకరు, చార్మినార్ 4బి సర్కిల్‌కు సరూర్‌నగర్ ఈస్ట్‌కు చెందిన ఎం.సునిత గెలుపొందారు. 10,000రూపాయల బహుమతులు ఐదుగురికి డ్రా తీయగా వీరిలో సర్కిల్ -12 శేరిలింగంపల్లి మక్తమహబూబ్‌పేటకు చెందిన మర్వాడ జగనాథ్ సంజయ్ సరోజ్, ఆబిడ్స్ -9బి నల్లకుంటకు చెందిన వి.ఆర్.ఎన్.శర్మ, ఖైరతాబాద్ 7బి సర్కిల్ దత్తాత్రేయ నగర్‌కు చెందిన ఒకరు, ఎల్బీనగర్ 3బి సర్కిల్‌కు కర్మన్‌ఘాట్‌కు చెందిన టి.పావని, ఆబిడ్స్ 9బి సర్కిల్ నల్లకుంటకు చెందిన క్షత్రియ సేవా సమితిలకు బహుమతులు లభించాయి. 5,000రూపాయల బహుమతులు పది, 2,000 రూపాయల బహుమతులు 100మందికి కూడా ప్రకటించారు.
ప్రతివారం నగదు బహుమతులు – మేయర్
జూన్ 1వ తేదీ నుండి 7వ తేదీలోపు ప్రస్తుత సంవత్సరం పూర్తి ఆస్తిపన్నును చెల్లించిన వారికి లక్ష రూపాయల బంపర్ బహుమతి, 25,000, 12,500, 5,000రూపాయలు, 1,000రూపాయల చొప్పున బహుమతులు అందజేస్తున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. హైదరాబాద్ నగర అభివృద్దికి గాను తమ ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్నులను సకాలంలో చెల్లించి సహకరించాలని ఆయన కోరారు. జూన్ 30వ తేదీలోగా ఆస్తిపన్ను చెల్లించాలని, లేనట్టైతే ప్రతి నెలా రెండు శాతం జరిమానా ఉంటుందని తెలియజేశారు. జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్, నీటి పన్నులను నెలవారి చెల్లిస్తున్న విధంగా ఆస్తిపన్నును కూడా నెలవారిగా చెల్లించే విధానంపై అధ్యయనం చేస్తున్నట్టు ప్రకటించారు. గత సంవత్సరం మే నెలలో ఆస్తిపన్ను రూ. 12.92కోట్లు వసూలు కాగా ప్రస్తుత మే మాసంలో రూ 24.37కోట్ల రూపాయలు వసూలయ్యాయని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత మే 31వ తేదీలోగా రూ.29.20కోట్ల రూపాయల ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసులైందని, గత సంవత్సరం మే 31న కేవలం 9.88కోట్ల రూపాయలు మాత్రమే వసులయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, రామకృష్ణరావు, శంకరయ్య, కెనడి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.