ఆ రెండూ మన ప్రతిష్టకు తార్కాణాలు

జిఈఎస్‌, మెట్రోల విజయవంతంపై సిఎం కెసిఆర్‌

ప్రత్యేకంగా అధికారులు, పోలీసులకు అభినందనలు

హైదరాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ( జీఈఎస్‌), మెట్రో రైల్‌ ప్రారంభోత్సవం కార్యక్రమాలు విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్‌ తరువాత ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ ప్రతిష్ట మరింత పెరిగిందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాలను దిగ్విజయం చేసారని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత హుందాగా పోలీస్‌శాఖ పనిచేసిందన్నారు. పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అనేక మంది ప్రముఖులకు అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారని కేంద్రం ప్రశంసించినట్లు చెప్పారు. పోలీసులు సమన్వయం, టీం స్పిరింట్‌తో పని చేసి తెలంగాణ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేశారు. ఒకే రోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించారని సీఎం కితాబిచ్చారు. పోలీసులు ముందస్తు ప్రణాళిక, వ్యూహం ప్రకారం పనిచేయడంతో ఎక్కడ చిన్న అవాంతరం కూడా జరుగలేదన్నారు. తనిఖీల పేరుతో అతిథులను ఇబ్బంది పెట్టకుండానే కావాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి అందరినీ సమన్వయం చేస్తూ అతిపెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసారని సీఎం తెలిపారు. తెలంగాణ పోలీసులు అత్యున్నత ప్రమాణాలతోపాటు హుందాగా వ్యవహరించారు. రాష్ట్ర పోలీసులను అమెరికా సీక్రెట్‌ ఏజెన్సీ, కేంద్ర ¬ంశాఖ, నీతి ఆయోగ్‌, వివిధ దేశాల ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా సీఎస్‌ ఎస్పీ సింగ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలియజేశారు.