ఇంజినీరింగ్‌ ప్రవేశాలు తక్షణమే చేపట్టండి

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని భాజపా ప్రధాన కార్యాలయంలో నాయకులు అరుణజ్యోతి, శ్రీదర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లుతో కలిసి కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఒంటెద్దు పోకడలు, నిర్ణయాలు తీసుకోలేని అసమర్థత వల్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలే కాకుండా… చివరకు వృత్తివిద్యా సంస్థలు సైతం ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఏకీకృత రుసుముల వల్ల పేద, అల్పాదాయ వర్గాల వారిపై అదనపు భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ పై చర్చ
ఈనెల 7న తెలంగాణ ఉద్యోగ, ప్రజా, కుల సంఘాలతో రాజధానిలో భాజపా నిర్వహించే సమావేశంలో తెలంగాణ ఎలా వస్తది? అన్న అంశంపై చర్చించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో వ్యక్తమయ్యే అభిప్రాయాల అధారంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశానికి ముందు ప్రజాపిత బ్రహ్మకుమారీలు భాజపా నాయకులకు రాఖీలు కట్టారు.