ఇక తెలంగాణ మహాపోరు : కోదండరామ్‌

హైదరాబాద్‌- ఉప ఎన్నికల పోరు మంగళవారం జరిగే పోలింగ్‌తో ముగియనుండటంతో ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మహా పోరు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరకాల ఉప ఎన్నిక వల్ల తెలంగాణ ఉద్యమానికి కొంత విరామం ఇచ్చామన్నారు. ఉప ఎన్నికల్లో జేఏసీ మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.భిక్షపతి గెలుపుకోసం జేఏసీ భాగస్వామ్య పార్టీలు, సంఘాలు, సంస్థలు ప్రచారంలో తలమునకలై ఉన్నందున ఉద్యమానికి కొంత విరామం ఇవ్వక తప్పలేదన్నారు. ఉప ఎన్నికల తంతు ముగుస్తుండటంతో ఉద్యమంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఇక మహా పోరుతో ముందుకు సాగుతామన్నారు. ఉప ఎన్నికల్లో జేఏసీ మద్దతు ప్రకటించిన అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. పరకాల ఫలితం సమైక్యవాద పార్టీలకు గుణపాఠమవుతుం దన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అగమ్యగోచరమవుతుందని కోదండరాం పేర్కొన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వక తప్పదని ఆయన స్పష్టం చేశారు.