ఇక ప్రజలు క్షమించరు

– తెలంగాణ ఎంపీలు తిరుగుబాటు సైరన్‌
– వేరు కుంపటికి తెలంగాణ ఎంపీలు సై
– తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ ప్రజల్ని మోసం చేసింది
– ఇక ఆలస్యం చేస్తే ప్రజలకు దూరమవుతాం
– 2014లో పరాజయం పాలవుతాం
హైదరాబాద్‌ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రం ఇంకనూ దాటవేత ధోరణి అవలంబిస్తే ఇక ప్రజలు క్షమించరని తెలంగాణ ప్రాంత ఎంపీలు కలవరపడుతున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానవర్గం ఇంకనూ సాచివేత, దాటవేత ధోరణి అవలంబిస్తే మాత్రం వేరు కుంపటి పెట్టాలని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు యోచిస్తున్నారు. శనివారం పార్టీ సీనియర్‌ నేత కే.కేశవరావు ఇంట్లో జరిగిన టీ-కాంగ్రెస్‌ ఎంపీల సమావేశంలో ఈ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే పార్టీని వీడి వేరుకుంపటి పెట్టాలని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయించుకున్నారు. అన్ని పార్టీలను కలుపుకుని ఏర్పాటు చేసే తెలంగాణ ఫ్రంట్‌ ద్వారానే ఎన్నికల బరిలోకి దిగి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని, తద్వారా కేంద్రానికి మన దారికి తెచ్చుకోవాలన్నది టీ-కాంగ్రెస్‌ ఎంపీల వ్యూహంగా కనిపిస్తోంది. ఈలోగా తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానవర్గంపై ఒత్తిడి పెంచాలని తెలంగాణ ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణ ప్రజలు కారణంగా చూపుతూ తమను దోషిగా నిలబెడుతున్నారని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రం సాకారం కాకపోవడం వల్లనే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వరుస అపజయాలు మూటగట్టుకోవాల్సి వస్తుందని, తెలంగాణ విషయం తేల్చకుంటే కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందనే అభిప్రాయం బలపడుతుందని, పార్టీ తెలంగాణ ప్రజలకు దూరమవుతుందనే విషయాన్ని అధిష్టానాన్ని చెప్పి ఒప్పించాలని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు భావిస్తున్నారు.