ఈ-నామ్‌ ద్వారానే పత్తి కొనుగోళ్లు

– అసెంబ్లీలో మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

హైదరాబాద్‌,నంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఈ-నామ్‌ అమలవుతున్న మార్కెట్‌లలో త్వరలో పత్తి కొనుగోళ్లును ఈ-నామ్‌ ద్వారా జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో మార్కెట్‌లో ఈ-నామ్‌ అమలు, పత్తి కొనుగోళ్లు తదితర అంశాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 44 మార్కెట్‌లలో ఈ-నామ్‌ను అమలు చేస్తున్నామని, మరో 14 మార్కెట్‌లలో త్వరలోనే ఈ-నామ్‌ ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఈ-నామ్‌ను అమలు చేయలేకపోతున్నామని తెలిపిన మంత్రి ఈ విషయంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మార్కెట్‌కు పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులు విక్రయించుకొనేందుకు రైతులు వస్తున్నారని, ఈ తరుణంలో ఈ-నామ్‌ సర్వర్‌ స్పీడ్‌ లేకపోవటంతో కొనుగోళ్లు తీవ్ర ఆలస్యమవుతున్నాయని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలోనే వర్సెన్‌-2 సర్వర్‌ను తీసుకొస్తామని కేంద్రం తెలిపిందన్నారు. ఈ నామ్‌తో తూకాల్లో పారదర్శకత, ఇతర ప్రాంతాల్లోని ధరల బేరీజుతో విక్రయాలు జరిపుకొనే అకాశం ఉంటుందన్నారు. దీంతో రైతులకు మంచి మద్దతు ధర లభించటమే కాకుండా, డబ్బులు వెంటనే నేరుగా ఖాతాల్లో జమ అవుతాయన్నారు. వర్సెన్‌-2 సర్వర్‌ అందుబాటులోకి రాగానే పత్తి ఉత్పత్తులను కూడా ఈ-నామ్‌ ద్వారా కొనుగోళ్లు జరిగేలా చూస్తామని మంత్రి తెలిపారు.

తాజావార్తలు